శ్రీరామరక్ష సర్వజగద్రక్ష
శ్లో: శ్రీరామ రామ రామేతి, రమే రామే మనోరమే; సహస్ర నామ తతుల్యం, రామ నామ వరాననే.!!
రామ.. రెండక్షరాల ఈ పేరు ఎంతో మహిమాన్వితమైనది. ఓం నమో నారాయణ అష్టాక్షరి మంత్రం నుంచి ‘రా’ అనే అక్షరాన్ని.. ఓం నమశివాయ పంచాక్షరి నుంచి ‘మ’ అనే అక్షరాన్ని కలిపితే ‘రామా’. శివకేశవతత్వం ఇమిడివున్న ఈ నామం కన్నా అమృతం ఇంకొకటి వుండదంటే అతిశయోక్తి కాదు. రామనామాన్ని మించిన రక్ష ఏదీ. శ్రీరామరక్ష సర్వజగద్రక్ష అంటాం. తన రక్షణ కోరి వచ్చిన విభీషణుడిని చివరిదాకా కాపాడాడు శ్రీరాముడు. తన రక్షణలో వున్న పాండవులను అడుగడుగునా అపాయాల నుంచి సంరక్షించాడు శ్రీ కృష్ణుడు. అందుకే ఆ నారాయణుడిని మనస్పూర్తిగా శరణు వేడితే శరణ్యము, ఆశ్రయము, అభయం, శత్రువుల నుండి రక్షణ కవచం దొరుకుతాయి. శ్రీరామచంద్రుడు- పేరు వినగానే కన్నుల ఎదుట ఒక దివ్యమైన స్వరూపం సాక్షాత్కరిస్తుంది. ఆ రూపం సకల కల్యాణ గుణాలతో అలరారుతూ మనస్సులకు ఆనందాన్ని నింపుతూ మైమరపిస్తుంది. అదే శ్రీరామచంద్రునిలోని గొప్పతనం. అందరినీ ఆనందపరిచేవాడే శ్రీరాముడు.శ్రీరాముడు మానవునికుండవలసిన గుణాలను కలిగి సమాజంలో మనిషి ఎలా ప్రవర్తించాలో ఆచరించి చూపిన ఆదర్శమూర్తి. పదహారు గుణాలు అనే పదహారు కళలతో శ్రీరామచంద్రమూర్తి అయినాడు. మర్యాదాపురుషోత్తముడుగా కీర్తిని పొందాడు.రావణ వధానంతరం విభీషండు నూతన వస్త్రాలను, ఆభరణాలను ధరించమని ప్రార్థిస్తే కైకేయి కుమారుడైన భరతుడు నా కోసం ఎదురుచూస్తుంటే అతనిని చూసి కలసిన తరువాతే నాకీ అలంకారాలు అంటూ సున్నితంగా తిరస్కరించాడు. భగవన్నామ స్మరణకు మించిన ఉత్తమ సాధన కలియుగంలో లేదని శాస్త్ర వచనం.ఏడుకోట్ల మహామంత్రాలలో రెండక్షరాలా "రామ" మంత్రం శ్రేష్టమైనదని మనుస్మృతి తెలుపుతుంది. ఇది హరిహరతత్వంబు కలిసిన మహామంత్రంగా వినుతికెక్కింది.ఓం నమోనారాయణాయ' అనే ఆష్టాక్షరి మంత్రములో "రా" అను అక్షరం,'ఓం నమశ్శివాయ' అనేడి పంచాక్షరి మంత్రంబులో "మ" అన్న జీవాక్షరం కలిస్తే రామ నామం ఏర్పడింది.శివకేశవుల సంఘటిత శక్తియే 'రామ'మంత్రం. అందుచే రామమంత్రం సర్వశక్తివంతమైన, శ్రేష్టమైన ముక్తిప్రసాద మంత్రముగా వేదం అభివర్ణిస్తొంది. ఈ రెండు అక్షరములు ముక్తి అను అమృతాన్ని ప్రసాదిస్తాయి. సులభమైన ఈ నామం ఇహమందు సుఖమును, సంపదలను ఇస్తే, పరమునందు విష్ణుసాయుజ్యం ఇస్తుంది. లౌకికముగా భవభూతి, పారమార్ధికముగా ఆత్మానుభూతి రామనామం వలన కల్గుతుందని మహర్షుల ఉవాచ.రామ"..! ఈ మంత్రానికి అత్యంత శక్తిసామర్థ్యాలు ఉన్నాయి.
ఈ మంత్ర జపం వల్ల.. అన్ని సమస్యలు దూరమవుతాయని పురాణాలు చెబుతాయి. అందుకే ఈ నామంలో కలిగిన రాముడి కంటే..కూడా రామ నామమే గొప్పదని పురాణ కధనం.రామ నామాన్ని తారక మంత్రం అని పిలుస్తారు. తారక మంత్రాన్ని జపించడం వల్ల పుట్టుక నుంచి మరణం వరకు.. జీవితం సాఫీగా సాగుతుందని వివరిస్తుంది. చెడు కర్మలను మంచిగా మార్చుకోవడానికి ఈ రామనామం సహాయపడుతుంది. కాబట్టి అత్యంత శక్తివంతమైన రామనామాన్ని జపిస్తూ ఉండాలి. రాముడి ఆదర్శాలు ఈనాటికీ ఆచరణీయాలే అన్నారు గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్. ప్రతి కణంలోనూ, సృష్టి అంతటా నిండి ఉన్న శక్తే రాముడు.. రాముడు అందరి జీవితానికి వెలుగు దివ్వెగా అభివర్ణించారు. 'తరచుగా మనం మనలోని కాంతిని కనుగొనడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. నీవే ఆ వెలుగు అని తెలుసుకో. నీవు కేవలం రక్తం, మాంసం, ఎముకలు మాత్రమే కాదు. నీవే ఆ వెలుగు. ఈ అవగాహన కలిగి ఉన్నప్పుడు, మీరు అన్ని మానసిక క్షోభల నుండి విముక్తి పొందుతారు. జీవితంలో శాంతి కలుగుతుంది. రాముడు సంఘర్షణల జీవితంలో ఎఱుకను, శాంతిని బోధిస్తాడు అని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ రామ నమ విశిష్టతను అద్భుతంగా తెలిపారు.రామ’ అనే పదంలోని ‘రా’ అక్షరం పలికేటప్పుడు నోరు తెరుచుకుని మనలోని పాపాలన్నీ బయటకు వచ్చి అగ్నిజ్వాలల్లో పడి దహించుకుపోతాయనీ, ‘మ’ అనే అక్షరం పలికేటప్పుడు నోరు మూసుకుని బయటి పాపాలని మనలోనికి ప్రవేశించవని ఇందులోని అంతరార్థం.
Comments
Post a Comment