కామాఖ్యా దేవి




భారతదేశంలోని 51 శక్తిపీఠాల్లో అత్యంత ప్రాచీనమైనది, పవిత్రమైనది అస్సాంలోని నీలాచల్ పర్వతంపై వెలసిన కామాఖ్యా దేవి ఆలయం. ఇక్కడ వెలసిన దేవిని కామాఖ్యా దేవి, కామరూపిణి అని పిలుస్తారు. "కామం" అనగా సాధారణంగా శారీరక ఆకర్షణ లేదా చిత్తచాంచల్యం అని అర్థం. కానీ ఇక్కడ "కామ" అనగా సంకల్పం, మార్పు శక్తిగా భావించబడుతుంది. అనుకున్న రూపాన్ని, అనుకున్న క్షణంలో మార్చుకోగల శక్తి కలిగినవారే కామరూపిణులుఅలాంటి శక్తిమంతురాలు కావడంతోనే ఆమెను కామరూపిణీ అంటారు.

కామాఖ్యా దేవి అనేక రూపాల్లో భక్తులకు ప్రత్యక్షమై, వారి కోరికలను తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందింది. ఆమెను త్రిపుర శక్తిదాయినిగా కొలుస్తారు, ఎందుకంటే ఈ క్షేత్రంలో ఆమె మూడు ప్రధాన రూపాల్లో దర్శనమిస్తుంది. తంత్ర, శక్తి, భక్తి పరంగా ఇది అత్యంత శక్తివంతమైన పీఠంగా భక్తుల విశ్వాసానికి కేంద్రంగా నిలుస్తోంది. ఆలయంలో విగ్రహం లేకుండా, యోనిపీఠాన్ని మాత్రమే పూజిస్తారు. ఇది శక్తిస్వరూపాన్ని సూచిస్తుంది.

ఈ క్షేత్రంలో జరిగే అంబుబాచీ మేళాకు విశేష ప్రాధాన్యం ఉంది. మానవ స్త్రీల మాదిరిగానే కామాఖ్యా దేవికి నెలలో మూడు రోజులు ఋతు స్రావం తంతు ఉంటుందని భక్తులలో అపారమైన నమ్మకం ఉంది. మృగశిర నక్షత్రం మూడవ పాదం నుండి ఆరుద్ర నక్షత్రం మొదటి పాదం వరకూ అమ్మవారి శరీర స్రావం జరుగుతుంది. ఆ రోజులలో ఆలయం మూసివేసి, మూడవ రోజున శుద్ధి కార్యక్రమాల అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తారు.

భక్తులు "ఓం ఐం హ్రీం క్లీం కామఖ్యాయై నమః" మంత్రాన్ని నిత్య జపిస్తే తల్లి అనుగ్రహం పొందవచ్చు. కుంకుమ, నెయ్యి దీపం, కొబ్బరి, అరటి పండ్లతో పూజించటం ఫలప్రదం. శ్రద్ధ, భక్తి, నియమం ఉంటే కామాఖ్యా తల్లి ఆశీస్సులు ఖచ్చితంగా లభిస్తాయని భక్తులలో అఖండ నమ్మకం ఉంది. ఆలయ ప్రాంగణంలో పశుబలి కూడా నిర్వహించబడుతుంది, ఇది తంత్ర సంప్రదాయానికి సంబంధించినది. కామాఖ్యా ఆలయం భారతదేశంలో తంత్ర విద్యకు కేంద్రంగా ప్రసిద్ధి చెందింది.

ఆలయం చుట్టూ ప్రకృతి సౌందర్యం, నీలాచల పర్వతం అందాలు భక్తులను ఆకట్టుకుంటాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు, పర్యాటకులు ఆలయాన్ని దర్శించేందుకు వస్తారు. కామాఖ్యా దేవి ఆలయం భారతీయ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తోంది.

Comments

Popular posts from this blog

కర్మ సిద్ధాంతం

భక్తులను సదా రక్షించే శ్రీ సాయి

విశాఖపట్నం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం