ధనుర్మాసం విశిష్టత




శ్లో. మదుసూధన దేవేశ ధనుర్మాస ఫలప్రదా

తవ మూర్తి ప్రదానేన మమసంతు మనోరథా:


సూర్యుడు నెలకు ఒక రాశి చొప్పున 12 నెలలు 12 రాశులలో సంచరిస్తాడు. ఆ విధంగా సూర్యుడు ధనుస్సు రాశిలో సంచరించే సమయాన్ని ధనుర్మాసము అని పిలుస్తారు. ధనుర్మాసము దక్షిణాయణంలో చివరి మాసము. ఈ నెల 16న ప్రారంభమయ్యే ధనుర్మాసము జనవరి 13న ముగుస్తుంది. సంక్రాంతికి ఒక నెల ముందు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. సూర్యుడు ధను రాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలవుతుంది. తిరిగి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సంక్రాంతి రోజుతో ధనుర్మాసం ముగుస్తుంది.భక్త వత్సలుడైన ఆ శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతి పాత్రమైనది “ధనుర్మాసము”. ఈ మాసములో ఆ స్వామిని ఉద్దేశించి చేసే చిన్నపాటి పూజాది క్రతువైనా అక్షయ, అమోఘ సత్పలితాలను ప్రసాదిస్తుంది.ఈ మాసంలో విష్ణువును మధుసూధనుడు అనే పేరుతో పూజించి, మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత పదిహేను రోజులు దద్యోజనం అర్పించాలి.ధనుస్సంక్రమణ రోజు స్నానాలు, పూజలు, జపాలు చేయడం మంచిది. సూర్యాలయాలు, వైష్ణవాలయాలు సందర్శించడం శుభప్రదం అని మన శాస్త్రాలు తెలియజెస్తున్నాయి.ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. దరిద్రం దూరం అవుతుంది. ఈ మాసంలో ప్రతి రోజు బ్రాహ్మముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులగుట తద్యమని శాస్తవ్రచనం.ప్రతిరోజూ సూర్యోదయానికి ముందు లేచి , స్నానాదికాలు ముగించాలి. పంచామృతాలతో శ్రీమహావిష్ణువును అభిషేకించాలి. అభిషేకానికి శంఖం ఉపయోగించడం మంచిది. తర్వాత తులసీ దళాలు, పూలతో అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం నమర్పించాలి. ఈ నెలరోజులూ విష్ణు కథలను చదవటం, తిరుప్పావై పఠించటం చెయ్యాలి.

శ్రీకృష్ణుని ధనుర్మాసం నెలరోజులూ తులసీ మాల సమర్పించే యువతులకు, నచ్చిన వరునితో వివాహం జరుగుతుంది. ధనుర్మాస వ్రతం దీని గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం. ధనుర్మాస వ్రతం గురించి బ్రహ్మాండ, ఆదిత్య పురాణాల్లో, భాగవతంలో, నారాయణ సంహితలో కనిపిస్తాయి.

ఈ మాసంలో వేకువనే చేసే పూజలో ప్రసాదంగా పులగం , పాయసం , దద్దోచనం సమర్పిస్తారు. చలికాలంలో కడుపులో జఠరాగ్ని పెరిగి తద్వారా ఆకలి పెరుగుతుంది. ఈ జఠరాగ్ని సాత్వికాహారం తీసుకోవడం వల్ల చల్లబడుతుంది. పాలు , పెరుగు , పెసరపప్పులతో చలువ చేసే గుణం ఉన్నందువలన ప్రసాదంగా వాటిని వినియోగించటం జరుగుతుంది.

ధనువు అంటే ఓంకారం. ధనువులో మూడు వంపులు ఉంటాయి. వాటిని కలిపే ఒక తాడు ఉంటుంది. ప్రణవంలో మూడు వర్ణాలు ఉంటాయి. అకార, ఉకార, మకారాలు. ఆ మూడింటిని కలిపే ది జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి, పరిజ్ఞానం. ధనువులో ఒక చివర జీవాత్మ, మరొక చివర పరమాత్మ ఆ రెండింటిని కలిపే తాడు ప్రకృతి లేక అమ్మ(లక్ష్మీదేవి). ఇలా జీవాత్మ పరమాత్మను చేరు సాధనాన్ని తెలిపే మాసం ధనుర్మాసం. ఈ సమయంలో చాంద్రమా నం ప్రకారం మార్గశిరం. పరమాత్మను చేరుటకు ఉత్తమమైన దారిని చూపునది మార్గశిరం. ధనుర్మాసం మార్గశిరంలోనే రావడం ఒక గొప్ప విశేషం.
ఈ ధనుర్మాసమంతా గోదా దేవి రచించిన తిరుప్పావై పఠించడం, విష్ణువుకు పువ్వులు సమర్పించడం, శ్రీ హరికి సంబంధించిన ధార్మిక కార్యక్రమాలకు అంకితం చేయాలి.తిరుప్పావైలో తిరు అంటే పవిత్రమైనది.. పావై అంటే వ్రతం. గోదా దేవి తిరుప్పావైని రచించారు. ధనుర్మాసంలో ఈ వ్రత కథను క్రమం తప్పకుండా చదవాలి.ధనుర్మాసంలో మొదటి పక్షం రోజులు సూర్యోదయానికి ముందు పూజా కార్యక్రమాలు, రెండో పక్షం రోజులు సూర్యోదయం తర్వాత పూజలు నిర్వహిస్తారు.
ధనుర్మాసంలో మహిళలు కాత్యాయినీ వ్రతం, ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలి. ఈ మాసంలో వచ్చే మోక్షద ఏకాదశి ఏడాదిలో వచ్చే చివరి ఏకాదశి కనుక ఉపవాస దీక్ష, వ్రతాన్ని ఆచరించాలి.
ఏడాది పొడవునా నిత్య దైనందిన కార్యక్రమాలతో ఉంటూ భగవంతుని కోసం సమయం కేటాయించలేని వారి కోసమే ఈ ధనుర్మాసం. అందుకే ఈ నెలలో ఎలాంటి శుభకార్యాలు చేయరు. శుభకార్యాలు ఉండవు కాబట్టి ఈ మాసాన్ని శూన్యమాసం అంటారు. ఎందుకంటే రవి ధనస్సు రాశిలోకి ప్రవేశించి మకరంలోకి వెళ్ళే సమయమే ధనుర్మాసం. ధనుస్సు, మీనంలో రవి ఉన్నప్పుడు, సూర్యుని రాశి అయిన బృహస్పతిలో ఉన్నప్పుడు ఏ శుభకార్యాన్ని నిర్వహించకూడదు. కేవలం పండుగ వాతావరణంతో అంతా సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు.

Comments

Popular posts from this blog

భక్తులను సదా రక్షించే శ్రీ సాయి

విశాఖపట్నం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం

కర్మ సిద్ధాంతం