హృదయ శుద్ధి

ఆత్మశుద్ధి లేని యాచారమది యేల

భాండశుద్ధి లేని పాకమేల?
చిత్తశుద్దిలేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ! వినుర వేమ!

మూఢనమ్మకాల చట్రంలో బ్రతుకుతూ అదే ఆధ్యాత్మికత అని భ్రమలో కొట్టుమిట్టాడే మానవులకు వేమన పరోక్షంగా ఈ పద్యం ద్వారా చురకలు అంటించాడు. కర్మలు చేయడం మానవుల ప్రధాన కర్తవ్యం అయితే ఆ కర్మలకు మంచి సానుకూల ఫలితాలు రావాలంటే పవిత్రమైన మనసు ఎంతో అవసరం అన్నది వేమన ప్రబోధం. మన మనసు నిర్మలంగా లేనపుడు ఎన్ని ఆచారాలు పాటించి మాత్రం ఏం ప్రయోజనం  ? 


మనసంతా కోరికలు, అశాంతి, అసూయ, ఈర్ష్య వంటి వ్యతిరేక ఆలోచనలు నింపుకొని పైకి ఆడంబరమైన పూజలు, స్తోత్రాలు వంటి ఆచార వ్యవహార కాండ చేయడం వలన ఎలాంటి ప్రయోజనం ఒనగూడదు. అన్నింటికీ నిర్మలమైన మనసే ప్రధానం. అందుకే మనస్సును పవిత్రం గా ఉంచుకోవడానికి పురుష ప్రయత్నం చేయాలి. అంతే నేటి కంప్యూటర్ భాషలో చెప్పాలంటే సాఫ్ట్ వేర్ ఎలాంటి వైరస్ లేకుండా వుండాలి. అప్పుడే కంప్యూటర్ ఎలాంటి సమస్యలు లేకుండా సమర్ధవంతంగా పనిచేస్తుంది. దీనికి ఉదాహరణగా శుచి, శుభ్రత లేని పాత్రలలో వంట చేస్తే అది పాడైపోయి తినేవారికి అనారోగ్యం కలిగిస్తుంది. వంట చేసేటప్పుడు మానసిక పవిత్రతతో పాటు శారీరక పవిత్రత వుండేలా అందుకే మన పూర్వీకులు కొన్ని ఆచార వ్యవహారాలు ఏర్పరిచారు.అట్లే మానసిక పవిత్రత లేకుండా చేసే శివపూజ ఎటువంటి సత్ఫలితాలనివ్వదని వేమన చెబుతున్నాడు. 


ఈ కలియుగంలో మనసులో అసలైన భక్తి లేకుండా పైకి ఇతరుల కోసం తమ గొప్పులు చూపించుకునేందుకు చేసే పూజలు, వ్రతాలు, ప్రార్థనలు  వ్యర్ధమే సుమా అని వేమన మనల్ని పరోక్షంగా హెచ్చరిస్తున్నాడు. భగవంతునికి కావలసింది భక్తుని యొక్క చిత్తశుద్ధి, నిరాడంబరత,పవిత్రమైన  మనస్సు,అవాజ్యమైన ప్రేమ, భగవంతుని త్రికరణ శుద్ధిగా నమ్మి, నిరంతర ధ్యానం లో వుండడం. ఈ లక్షణాలు గల భక్తులకు ఆ భగవంతుని కరుణ కటాక్షాలు తప్పక లభిస్తాయన్న వేదవాక్కును వేమన తన పద్యం ద్వారా నర్మగర్భంగా తెలియజేస్తున్నాడు.

Comments

Popular posts from this blog

భక్తులను సదా రక్షించే శ్రీ సాయి

విశాఖపట్నం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం

కర్మ సిద్ధాంతం