అన్నదానం మహా శ్రేష్టం
కనక రజిత పాత్రం, మేదినీం సాగరాంతాం
ఉభయకుల విశుద్ధం కోటి కన్యా ప్రదానం!
నహి నహి బహు దానం అన్నదానం సమానం
ఏనుగులు, గుర్రములు వేల సంఖ్యలో దానం చేసిననూ, మంచి గోవులనూ కోట్లలో దానం చేసిననూ, బంగారం, వెండిని లెక్కకు మించి దానం చేసిననూ, సాగర పర్యంతము గల ఈ సువిశాల ప్రపంచమునే దానముగా ఇచ్చిననూ, కోటి కన్యలను దానముగా ఇచ్చిననూ అవి అన్నియూ ఆకలిగొన్న వారిని కూర్చుండ బెట్టి చేయు అన్నదానముకు సమమైన దానములు కావు అని అంటుంది పై శ్లోకం.
ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వారికి అన్నదానం ఒక పవిత్రమైన అర్పణగా భావించడం భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్న ఒక గొప్ప సంస్కృతి. నేటికీ మన దేశంలో మారుమూల పల్లెల్లో కూడా అన్నదానం విసృతంగా జరుగుతోందంతే ఈ దానానికి వున్న వైశిష్ట్యం ఏమిటో తెలుస్తోంది. అన్నిటికీ మించి, అన్నదానం చేయడంలో ఒక ఆనందం ఉంది. ఇది కేవలం ఆహారం అందించడమే కాదు. మీ భౌతిక శరీరాన్ని ‘అన్నమయ కోశం లేదా ఆహార శరీరం అని పిలుస్తాము, ఎందుకంటే ఇది ఆహార పోషకాలతో నిర్మించబడింది. కాబట్టి, మీరు అన్నదానం చేస్తే, వారికి శరీరాన్ని అందిస్తునట్లే అని మనం అర్ధం చేసుకోవాలి.
అన్నం పరబ్రహ్మ స్వరూపం అని వేద వాక్కు. అన్నం లేకుండా ఏ ప్రాణి జీవించడం అసాధ్యం. అన్నం ఎటువంటి లోటు లేకుండా దొరకడం అంటే సాక్షాత్తు ఆ కాశీ అన్నపూర్ణ అమ్మవారి అనుగ్రహం తప్పనిసరి కావాలి. ఆ అమ్మను నిత్యం కొలిచేవారికి అన్నపానాదులకు ఎటువంటి లోటు ఉండదు. ప్రతి నిత్యం భోజనం చేసేటప్పుడు ఆ అమ్మను కృతజ్ఞత పూర్వకంగా ధ్యానం చేసుకుని విశ్వంలో మనతోపాటు ఉండే అనేకానేక జీవులకు బలిభుక్కులు సమర్పించి భోజనం చేసినవారికి, అతిథి అభ్యాగతి సేవ, ఆపన్నులకు, ఆకలితో బాధపడేవారికి అన్నప్రసాదాన్ని అందించే వారికి ఆ తల్లి అనుగ్రహం ఉంటుందని శాస్త్ర ప్రవచనం.త్రేతాయుగం, ద్వాపర యుగాల్లో యజ్ఞయాగాదులు తపస్సుల ద్వారా మానవులు మోక్షం పొందారు. కలియుగంలో దాన ధర్మాలు, దైవారాధన, నామ పారాయణ, నామస్మరణ మొదలైన వాటి ద్వారా సులభతరమైన మోక్షమార్గాన్ని దైవం ప్రసాదించాడు. దానధర్మాలు ఎవరికున్నంతలో వారు దానం చేసుకోవచ్చు. ఈ దానం చేసేది కూడా మనస్ఫూర్తిగా చేయాలి. ఆడంబరాలకు పోనవసరం లేదు.
మనం ఎన్ని దాన ధర్మాలు చేసినా.. ఎవ్వరికీ ఎన్ని ఇచ్చినా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. కావాలని ఒక్క అన్నదానంలో మాత్రమే దానం తీసుకున్నవారు ఇంక చాలు అని చెప్పి సంతృప్తి చెందుతారు. మిగిలిన ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్న వారిని మనం సంతృపరచలేకపోవచ్చు. కానీ ఒక్క అన్నదానంలో మాత్రం దానం తీసుకున్న వారిని పూర్తిగా సంతృప్తపరచొచ్చు.
అన్నమే అన్నకోశములో ప్రవేశించి ప్రాణంగా మారు తున్నందు వలన అన్నదానం అంటే ప్రాణాన్ని దానం చేయ డమే. అంతేకాదు ఒక ప్రాణం నిలవడానికి కావలసినవన్ని అన్నమే. కనుక అన్నదానం చేయడం శ్రేష్టం అని, అన్ని దానములకెల్ల అన్నదానం మిన్న అని, శాస్త్రాలు చెప్తున్నా యి. ఏదైనా దానం చేసేప్పుడు విచక్షణ అవసరం కానీ అన్న దానానికి మాత్రం ఈ నియమం లేదు. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం అంటే వాళ్ళ ప్రాణాన్ని నిలపడమే కనుక అది అత్యంత శ్రేష్టం అయినది.
Comments
Post a Comment